01 వైర్లు లేకుండానే...
వాడేది ఎంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ అయిన్పటికీ ఫోన్‌ని సంప్రదాయ పద్ధతిలోనే ఛార్జ్ చేస్తున్నాం. అడపా... దడపా వైర్‌లెస్ పద్ధతిలో ఛార్జ్ చేసే పరికరాలు వాడుతున్నా... అవి పూర్తిస్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదు. అన్ని ఫోన్ మోడళ్లకు సరిపడేలా ఇంకా వాటిని తీర్చిదిద్దలేదు. ఉదాహరణకు Qi, PMA-A4WP వైర్‌లెస్ ఛార్జింగ్ పరికరాలు. వీటితో మార్కెట్‌లో కొత్తగా అందుబాటులో ఉన్న కొన్ని ఫోన్‌లను మాత్రమే ఛార్జ్ చేయగలం. ఇవేం లేకుండా మరింత స్మార్ట్‌గా ఆలోచించండి...రోజంతా ప్రయాణం. ఫోన్‌లో ఛార్జింగ్ లేదు. ఇంటి తలుపు తీసి లోపల అడుగు పెట్టగానే జేబులోని ఫోన్ ఆటోమాటిక్‌గా ఛార్జ్ అవుతుంది. పనిగట్టుకుని దేనికీ ఫోన్‌ని డాక్ చేయక్కర్లేదు. ఏ ఛార్జింగ్ స్టేషన్‌పైనా ఉంచాల్సిన పని లేదు. ఫోన్‌తో ఏ రకమైన కనెక్షన్ లేకుండా బ్యాటరీకి పవర్ అందుతుంది. ఇంట్లో వై-ఫై నెట్‌వర్క్‌లా ‘వైర్-ఫ్రీ’ పవర్ ట్రాన్స్‌ఫర్‌ని వాడుకుని ఇంట్లో అందరి ఫోన్లనూ ఛార్జ్ చేసుకోవచ్చన్నమాట. Uncoupled power transfer టెక్నాలజీ త్వరలోనే ఈ తరహా ఛార్జింగ్ విధానాన్ని పరిచయం చేయవచ్చని టెక్ నిపుణుల అంచనా. |
02 రెండు తెరలు...
అంగుళాల తాకేతెరపై మునివేళ్లతోనే అన్నీ ముగించేస్తున్నాం. ఇప్పుడు మరిన్ని అదనపు సౌకర్యాల్ని తెరపై మరింత సులువుగా యాక్సెస్ చేసేందుకు ‘డ్యూయల్ డిస్‌ప్లే’ ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్. ఈ నేపథ్యంలో కొన్ని అరుదైన డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్‌లు టెక్ ప్రియుల దృష్టిని కట్టిపడేస్తున్నాయి. అందుకు ఉదాహరణే Curved, e-ink డిస్‌ప్లేలు...Yotaphone స్మార్ట్ ఫోన్‌ని చూడండి. రెండు వైపుల తాకేతెరలు ఉన్నాయి. ఒకవైపు తెరని ఈ-రీడర్ మాదిరిగా వాడుకోవచ్చు. ప్రైమరీ తాకేతెర పరిమాణం 5 అంగుళాలు. సెకండరీ తెర పరిమాణం 4.7 అంగుళాలు. grayscale తాకేతెర. రెండు తెరల్ని అవసరం మేరకు వాడుకోవచ్చు. అలాగే, ఈ మధ్యే డ్యూయల్ స్క్రీన్స్‌తో విడుదలై సందడి చేసింది ఎల్‌జీ కంపెనీ తయారు చేసిన V10 స్మార్ట్ ఫోన్. 5.7 అంగుళాల తాకేతెరతో పాటు తెర పై భాగంలో మిని డిస్‌ప్లే ఉంది. 2కే రిజల్యూషన్‌తో ప్రైమరీ తాకేతెరని తీర్చిదిద్దారు. సెకండరీ తాకేతెర రిజల్యూషన్ 1040X160 పిక్సల్స్. ఫోన్‌లో తరచూ వాడే ఆప్షన్స్‌ని ఐకాన్ల రూపంలో సెకండీ కెమెరాలో పెట్టుకోవచ్చు. ఈ తరహా ఫోన్లు ఈ ఏడాది మరిన్ని టెక్ ప్రియుల్ని అలరించే అవకాశం ఉంది. డ్యూయల్ తెరల పరిమాణంలో భిన్నమైన మార్పులతో సరికొత్త మోడళ్ల టెక్ ప్రియుల్ని ఆకట్టుకోనున్నాయని టెక్ నిపుణులు అంచనా. అంతేకాదు తెరని రెండు సగ భాగాలుగా పంచుకుని వాడుకునే విధంగా ఫోన్లు రూపాంతరం చెందొచ్చు. |
03 ఇక వాటికి సెలవు...
ఇప్పటికీ మార్కెట్‌లో ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్‌లలో ఎలాంటి మార్పు లేకుండా కనిపించేది 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్. ఇది అందరికీ తెలిసిందే. కానీ, ఈ జాక్‌తో వచ్చే సమస్య ఏంటో తెలుసా? అన్ని హెడ్‌ఫోన్ జాక్‌లు చూడడానికి ఒకేలా కనిపించినా... వాటి పరిమాణాల్లో కాస్త తేడా ఉంటుంది. అందుకే ఒక స్మార్ట్ ఫోన్ హెడ్‌సెట్‌ని మరో ఫోన్‌కి కనెక్ట్ చేస్తే ఆడియో సరిగా వినిపించదు. మరి, ఎంత కాలం ఇలాంటి సమస్యని ఎదుర్కొంటారు?...దీనికి పరిష్కారంగా యాపిల్ కంపెనీ ఏకంగా 3.5 ఆడియో జాక్‌లకు స్వస్తి పలకనుందట. నెటిజన్లు నోళ్లలో నానుతున్న టెక్ అప్‌డేట్ ఇది. ఈ తరహాలో స్మార్ట్ ఫోన్‌లను తొలిసారి అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోందట. మరైతే హెడ్‌ఫోన్‌లను వాడడం ఎలా? అనే సందేహం అక్కర్లేదు. అందుకో సరికొత్త ప్రత్నామ్నాయం బ్లూటూత్ నెట్‌వర్క్‌తో పని చేసే హెడ్‌సెట్‌లేనట. యాపిల్ కంపెనీ ఇప్పటికే ప్రత్యేక అడాప్టర్లను కూడా అందిస్తోంది. ఐఫోన్ Lightning Dock పరికరం అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఫోన్‌ని దీనికి డాక్ చేస్తే చాలు. వైర్‌లెస్ నెట్‌వర్క్‌ని వాడుకుని హెడ్‌ఫోన్‌లో మ్యూజిక్ వినొచ్చట. |
04 స్టోరేజ్ సామర్థ్యం...
మీరు వాడే స్మార్ట్ ఫోన్ ఇంటర్నల్ మెమొరీ సామర్థ్యం ఎంత? ఎక్కువ శాతం యూజర్ల సమాధానం 16జీబీ. ఎందుకంటే ఇప్పటి వరకూ మార్కెట్‌లో సందడి చేస్తున్న స్మార్ట్ ఫోన్ల ఇంటర్నల్ మెమొరీ సామర్థ్యం అంతే కొనసాగుతోంది. కానీ, నిత్యం స్మార్ట్‌ఫోన్‌ని చేతిలో పెట్టుకుని వాడే యూజర్లకు బిల్ట్‌ఇన్ మెమొరీ మరింత ఎక్కువే ఆశిస్తున్నారు...డ్యూయల్ కెమెరాలతో హై క్వాలిటీ ఫొటోలు... 4కే వీడియోలు... ప్లే స్టోరుల్లో లెక్కకు మిక్కిలి ఆప్స్... ఇలా అన్ని మెమొరీలో పెడుతూ వెళ్తే... ఫోన్ కొనుగోలు చేసి కొన్ని రోజులకే ఎస్‌డీ కార్డ్ అవసరం ఏర్పడుతుంది. అందుకే స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ బిల్ట్‌ఇన్ మెమొరీతో కూడిన ఫోన్లకే ఓటేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి మార్కెట్‌లోకి వచ్చే స్మార్ట్ ఫోన్లు 32 జీబీ మెమొరీ సామర్థ్యంతో కూడినవే ఉండొచ్చట. ఇక మీదట మొబైల్ తయారీ కంపెనీలు 32 జీబీ ఇంటర్నల్ మెమొరీని సగటు వాడకంగా పరిగణించొచ్చని అంచనా. |
05 4కే తెరలు...
ఖరీదు ఎక్కువైనా ఫర్వాలేదనుకుంటే 2K రిజల్యూషన్‌తో కూడిన ఫోన్లను మార్కెట్‌లో సిద్ధంగా ఉన్నాయి. కానీ, మీరు ఏకంగా 4K రిజల్యూషన్‌తో కూడిన మొబైల్‌ని వాడాలనుకుంటే? ఎందుకంటే వర్చువల్ రియాలిటీ (వీఆర్) బుల్లి తెరలపై చేసే అద్భుతాల్ని మీరూ కళ్లకు కట్టినట్టుగా చూడాలనుకుంటారు. కానీ, ఇప్పటికైతే కచ్చితమైన 4కే రిజల్యూషన్‌తో పని చేసే ఫోన్లు మార్కెట్‌లో అరుదే!...ఇప్పటికైతే సోనీ కంపెనీ రూపొందించిన Z5 Premium ఒకటి ఉంది. ప్రపంచంలోనే తొలిసారి అందుబాటులోకి వచ్చిన 4కే స్మార్ట్ ఫోన్ ఇదేనట. రిజల్యూషన్ 3840X2160పిక్సల్స్. అయితే, మొబైల్ నిత్యం 4కే రిజల్యూషన్‌తో పని చేయదట. వర్చువల్ రియాలిటీ వూపు అందుకుంటున్న నేపథ్యంలో పూర్తిస్థాయి 4కే రిజల్యూషన్ మొబైళ్లకు ఈ ఏడాది వేదిక కావచ్చు. |
06 కొత్తగా కెమెరాలు..
ముందొక కెమెరా... వెనక మరోటి... ఫోన్‌లో డ్యూయల్ కెమెరాలు కొత్తేం కాదు. వాడుతున్నాం. అదిరేలా ఫొటోలు తీస్తున్నాం. ఇక్కడితో కెమెరా కవ్వింతలు ఆగిపోలేదు. ఫోన్‌లోని కెమెరాల సంఖ్యని పెంచుకుంటూ మరింత నాణ్యమైన ఫొటోలను క్లిక్ మనిపించేలా సిద్ధం అవుతుంది. అదెలాగంటే....ఫోన్ వెనక (Dual rear Cameras) రెండు కెమెరాల్ని నిక్షిప్తం చేస్తున్నారు. దీంతో ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా చక్కని ఇమేజ్ క్వాలిటీతో ఫొటోలు తీయొచ్చు. ఈ తరహాలో ఇప్పటికే కొన్ని మొబైల్ తయారీ కంపెనీలు (హెచ్‌టీసీ, లెనోవో, Huawei, Qiku, Xolo) సరికొత్త మోడళ్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. ఉదాహరణకు XOLO BLACK ఫోన్. దీనికి 13 మెగాపిక్సల్, 2 మెగాపిక్సల్ సామర్థ్యంతో రెండు డ్యూయల్ కెమెరాల్ని వెనక నిక్షిప్తం చేశారు. ముందు సెల్ఫీలకు 5 మెగాపిక్సల్ కెమెరా ఉండనే ఉంది.
మరింత ఎక్కువ సామర్థ్యంతో కూడిన డ్యూయల్ రేర్ కెమెరాల ఫోన్‌ని QiKU కంపెనీ అందిస్తోంది. రెండు కెమెరాల సామర్థ్యం 13 మెగాపిక్సల్స్... ఇలా అదనపు కెమెరాలతో కూడిన ఫోన్ల ఖరీదు ఎక్కువేమో అనే సందేహం అక్కర్లేదు. బడ్జెట్ ధరలోనే వీటిని అందించేందుకు కంపెనీలు భిన్నమైన మోడళ్లను ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ అంగళ్లలో ఉన్న xolo black ధర ఎంతో తెలుసా? సుమారు రూ.10,000 |
07 కళ్లే తాళాలు...
ఫోన్‌ని సురక్షితంగా వాడేందుకు పాస్‌వర్డ్, పిన్, పేట్రన్ లాక్‌లు వాడుతున్నాం. వాడేది ఇంకా కాస్త స్మార్ట్ ఫోన్ అయితే ఫింగర్ ఫ్రింట్ స్కానర్‌తో తాళం వేస్తున్నాం. ఫోన్‌ని అన్‌లాక్ చేయాలంటే వేలి ముద్రని రీడ్ చేయాల్సిందే. ఇవి ఇప్పటి వరకూ ఫోన్‌ని సురక్షితం చేసుకునేందుకు ఉన్న మార్గాలు. మీకు తెలుసా? ఈ ఏడాదిలో మొబైల్ రక్షణ మరో మైలురాయిని దాటేందుకు సిద్ధం అవుతోంది. అదేంటంటే... మీ కళ్లనే స్కాన్ చేసి పాస్‌వర్డ్‌లుగా పెట్టుకునే సదుపాయాన్ని ముందుకు తెస్తున్నాయి....Iris Scanners అందుకు సాక్ష్యం. ఫోన్‌లో బిల్ట్‌ఇన్‌గా నిక్షిప్తం చేసిన ఈ తరహా స్కానర్లతో మీ కళ్లను స్కాన్ చేసి Biometric Recognition ద్వారా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయవచ్చు. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఐరిస్ స్కానర్స్‌తో రెండు మోడళ్లను (Lumia 950, 950XL) ప్రవేశపెట్టింది కూడా. విండోస్ 10 ఓఎస్ వెర్షన్‌లో ప్రవేశపెట్టిన ‘విండోస్ హలో’ సౌకర్యాన్ని వాడుకుని ఐరిస్ స్కానర్‌ని యాక్టివేట్ చేయవచ్చు. దీంతో ఫోన్‌లోని బిల్ట్‌ఇన్‌గా నిక్షిప్తం చేసిన డూయల్ కెమెరాలు మీ కళ్లను గుర్తించి లాగిన్‌కి అంగీకరిస్తాయి. అంటే... ఇక ఫోన్‌ని అన్‌లాక్ చేయాలంటే ఫోన్‌లోకి చూస్తే చాలు అన్నమాట. ఈ తరహా మోడళ్లను ఇతర కంపెనీలు (Vivo, ZTE, Alcatel...) కూడా త్వరలో ప్రవేశపెట్టేందుకు సిద్ధం అని ప్రకటించాయి కూడా. |
08 మునివేళ్లతో మ్యాజిక్
ఫోన్ తాకేతెరలపై ఇప్పటి వరకూ చేసిన మ్యాజిక్‌లు వేరు. ఇకపై మరిన్ని అదనపు సౌకర్యాలతో తాకేతెరలన్నీ Pressure Sensitive డిస్‌ప్లేతో ముస్తాబు అవుతున్నాయి. అన్నీ కాకపోయినా... ఇప్పటికే యాపిల్ కంపెనీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్‌ల్లో ‘3డీ టచ్’ పేరుతో ఈ తరహా తాకేతెరల్ని పరిచయం చేసింది. వీటి ప్రత్యేకతేంటంటే...తెరపై మునివేళ్లతో తాకడం ఒక్కటే కాదు. వేలితో గట్టిగా ఒత్తితే ఒకలా... ఇంకా కాస్త ఒత్తిడి పెంచి ఒత్తితే మరోలా ఆప్షన్స్‌ని డిస్‌ప్లే చేస్తాయి. దీంతో ఏవైనా మెనూలను యాక్సెస్ చేయడం సులభం అవుతుంది. ఇంకా చెప్పాలంటే గేమింగ్‌లోనూ ప్రత్యేక ప్లే కంట్రోల్స్ రానున్నాయి. ఉదాహరణకు బైక్ రేస్‌లో ఒకసారి తాకి బైక్ స్టార్ట్ చేయవచ్చు. వేగాన్ని పెంచేందుకు కాస్త తెరపై ఒత్తితే చాలు. మరింత మెరుపు వేగంతో దూసుకెళ్లాలంటే ఇంకాస్త గట్టిగా ఒత్తొచ్చు. ఇలా తాకేతెరపై మరిన్ని మ్యాజిక్‌లు చేయవచ్చు. త్వరలోనే అన్ని కంపెనీలు ఈ తరహా తాకేతెరల్ని మొబైల్ ప్రియులకు పరిచయం చేయవచ్చు. |
09 నెట్‌వర్క్ సమస్యా?
ముఖ్యమైన ఫోన్ కాల్ మాట్లాడుతుంటారు... అనుకోకుండా ఫోన్ సిగ్నల్ పోతుంది. ఇంకేముందీ... కాల్ కట్ అవుతుంది. ఇలాంటి సమస్య లేకుండా సిగ్నల్ వ్యవస్థని దృఢంగా ఫోన్‌కి అందించేందుకు సరికొత్త కమ్యూనికేషన్ సిస్టం పరిచయం కానుంది.అదే VoLTE (Voice over Long-Term Evolution). ఇప్పటి వరకూ ఫోన్లలో వాడుతున్న సంప్రదాయ నెట్‌వర్క్ సిస్టం కంటే వేగంగా డేటాని మోసుకెళ్లేందుకు LTEటెక్నాలజీ అనుకూలం. అందుకే మొబైల్ తయారీ కంపెనీలు ఈ ఎల్‌టీఈ టెక్నాలజీని జత చేసుకుని 4G LTE నెట్‌వర్క్ సిస్టంతో ముందుకొస్తున్నాయి. కానీ, దేశీయ మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు ఇంకా LTE టెక్నాలజీకి అప్‌డేట్ అవ్వాల్సి ఉంది. ఇప్పటికిVodafone, Reliance Jio మాత్రమే LTE టెక్నాలజీ సపోర్ట్‌తో ముందుకొస్తున్నాయి. తాజాగా రిలయన్స్ కంపెనీ Lyf సిరీస్‌తో స్మార్ట్ ఫోన్‌లను ఇప్పటికే మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. డ్యూయల్ సిమ్‌లతో ఫోన్లు 4G LTE నెట్‌వర్క్‌ని సపోర్ట్ చేస్తాయి |
10 లై-ఫై సపోర్ట్...
అందరికీ సుపరిచితమైన వై-ఫైకి అప్‌డేట్ లై-ఫై (LiFi). మనుగడలో ఉన్న వై-ఫైకి వంద రెట్ల ఎక్కువ వేగం. ఇలా టెక్ ప్రియుల దృష్టిని అమితంగా ఆకట్టుకున్న లై-ఫై మొబైల్స్‌లోనూ ప్రవేశించనుందట. నమూనా మొబైల్ మోడళ్ల కూడా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షోల్లో సందడి చేశాయట కూడా. ఈ ఏడాదిలో అధికారికంగా మార్కెట్‌లో లై-ఫై ఫోన్లు సందడి చేయవచ్చని టెక్ నిపుణుల అంచనా. |
No comments:
Post a Comment